రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చంద్రబాబు

కావలి: ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన తెలుగు తమ్ముళ్లతో కలిసి దోచుకోవడానికి రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.  కావలి పట్టణంలోని 10వ వార్డులో శుక్రవారం ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే  ఇంటింటికీ వెళ్లి నవరత్నాలు కర పత్రాలను ప్రజలకు అందజేశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి  మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆయనతో పాటు, ఆయన మంత్రలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఇతర నాయకులు ప్రభుత్వ నిధులు దోపిడీనే లక్ష్యంగా పెట్టుకుని దినచర్యను పాటిస్తున్నారని మండిపడ్డారు.

అందుకే ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు ఏమీ జరగడం లేదన్నారు. అయినప్పటికీ చంద్రబాబు, టీడీపీ నాయకుల ధన దోపిడీ దాహం తీరకపోవడంతో రాష్ట్ర అభివృద్ధి పేరుతో ఎడాపెడా అప్పులు చేయడమే  ధ్యేయంగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.97 వేల కోట్లు ఉన్న రాష్ట్ర అప్పులను, చంద్రబాబు   రెండు లక్షలా 50 వేల కోట్లుకు పెంచారని తెలిపారు. రాజధాని కట్టడానికి రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతాయని గతంలో చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు రెండు వేల కోట్లు ఇస్తే చాలు అనడం ఏమిటని ప్రశ్నించారు. అబద్ధపు మాటలను నిత్యం ప్రచారంలో పెట్టి పబ్బంగడుపుకునే విధానాన్ని నిత్యం అనుసరిస్తున్న చంద్రబాబు బుద్ధిని ప్రజలు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలనను గుర్తు చేసేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సరికొత్త విప్లవాన్ని ఆవిష్కరించేలా ప్రజారంజక పాలన అందుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అందుకే దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కనమర్లపూడి వెంకటనారాయణ, కావలి రూరల్, అల్లూరు మండలాల పార్టీ అధ్యక్షులు జంపాని రాఘవులు గౌడ్, దండా కృష్ణారెడ్డి, పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసులు, సేవాదళ్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, డీఆర్‌యూసీసీ సభ్యుడు కుందుర్తి కామయ్య, వార్డు కౌన్సిలర్‌ కుందుర్తి సునీత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *